రవితేజ ‘బెంగాల్ టైగర్’ రివ్యూ

ప్రధాన తారాగణం: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, బొమన్ ఇరానీ, రావు రమేష్, పృథ్వీ – బ్రహ్మానందం, పోసాని, షిండే తదితరులు
ఛాయాగ్రహణం: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
నేపథ్య సంగీతం: చిన్నా
సంగీతం: భీమ్స్‌
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంపత్‌ నంది

ఇదో మాస్ మసాలా…రవి తేజ అభిమానులకు ఫుల్ మీల్స్…కంప్లీట్ యాక్షన్ కమ్ ఎంటర్టైనర్ అంటూ సినిమా మొదలైనప్పటి నుంచీ చెప్పుకొస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. ‘రచ్చ’ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు మాస్ మహారాజ్ రవి తేజ చేత స్క్రిప్ట్ ఒకే చేయించుకొని ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ తోప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ టైగర్ రోరింగ్ ఏ మేర ఉందో చూద్దాం!.

కధేంటి?

తక్కువ సమయంలో ఫేమస్ అవ్వాలంటే ఏమి చెయ్యాలో బాగా తెలిసినోడు ఆకాష్ నారాయణ్ (రవి తేజ). దీనికి కారణం తను పోకిరీగా తిరగడం వల్ల వచ్చిన పెళ్లి సంబంధాలు చెడిపోవడమే. ఎలాగైనా ఫేమస్ అవ్వాలి అని ఓ మంత్రి పైనే రాయి విసిరే సాహసం చేయగా…అతని ధ్యైర్యానికి మెచ్చిన సదరు మంత్రి పనిలో పెట్టుకుంటాడు. ఈ క్రమంలో మంత్రి కూతురు శ్రద్ధ (రాశి ఖన్నా) ఆకాష్ ప్రేమలో పడుతుంది. మొత్తానికి ఈ ఇద్దరికీ పెళ్లి చేద్దామని మంత్రి నిర్ణయించుకోగా…ఆకాష్ మాత్రం తాను సీఎం అశోక్ గజపతి (బొమన్ ఇరానీ) కుమార్తె మీరా (తమన్నా)ను ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. సీఎం కుమార్తె ను ఆకాష్ ప్రేమించడానికి కారణం ఏమిటి? అసలు ఆకాష్ గతమేంటి, టార్గెట్ ఏంటి? ఇలాంటి విషయాలకు సమాధానమే మిగతా కధ.

ఎవరి నటనెలా?

మాస్ మహారాజ గా పేరుగాంచిన రవి తేజ కి ఈ పాత్ర కొత్తదేమీ కాదు…ఇలాంటి మాస్ పాత్రలు బోలెడు చేశారు కాబట్టి తన బాడీ లాంగ్వేజ్, టైమింగ్ తో షరామామూలుగానే లాగించేశారు. అంటే ఈ పాత్రను రవితేజ పెద్దగా చాలెంజింగ్ గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా సునాయాసంగా తన ఎనర్జీతో హావభావాలను పండించగలిగాడు. కధానాయికలు తమన్నా, రాశి ఖన్నా నటన పరంగా పెద్ద స్కోప్ లేకపోయినా గ్లామర్ విందుకు డోకా లేదు. ఇద్దరూ కావాల్సినంత విందును కుర్రకారుకు అందించారు.

బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని సరిగ్గా వాడుకోలేక పోయారనే చెప్పాలి. అసలు ఈ మాత్రం పాత్రకు అంత పెద్ద నటుడు అవసరమా అన్న అనుమానమూ వస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ పృథ్వీ. ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప అవతారంలో మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పృధ్వీ యే అని చెప్పాలి. బ్రహ్మానందం పరవాలేదు. మిగతా పాత్రల్లో చేసిన రావు రమేష్, పోసాని, షాయాజి షిండే, తనికెళ్ళ, నాగినీడు తదితరులు మామూలుగా లాగించేశారు.

టెక్నికల్ టీం:

సంగీతాన్ని సమకూర్చిన భీమ్స్ ఓ రెండు పాటలకు మినహా మిగతా వాటికి చెప్పుకునే రేంజ్ లో భానీలను అందించలేకపోయారు. నేపధ్య సంగీతాన్ని అందించిన చిన్నా సన్నివేశాలకు తగ్గట్టే అందించి న్యాయం చేశారు. చాయాగ్రహణ పనితీరు ఆకట్టుకుంది..ఆహ్లాదకరంగా ఉంది అనడంలో సందేహం లేదు. నిర్మాణ విలువల పరంగా కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదనే చెప్పాలి…కాంప్రమైజ్ అయినట్లు లేదు.

దర్శకుడు సంపత్ విషయానికి వస్తే..ప్రేక్షకుల టేస్ట్ మారుతున్నా తను మాత్రం సేఫ్ జోన్ లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. మాస్ ప్రేక్షకులకు కావాల్సినవన్నీ సమపాళ్ళలో వడ్డించే ప్రయత్నం చేశాడు. ఎంత రొటీన్ కధ అయినా…చెప్పే రీతి (స్క్రీన్ ప్లే)లో మార్పు చూపిస్తే ఆ సినిమా సక్సెస్ సునాయాసమవుతుంది అన్న సూత్రం కనపడింది దర్శకుడి పనితీరులో. మంచి పంచులు, దానికి తగ్గ కామెడీ ని జోడించి సినిమాను పాస్ చేయించుకున్నాడు సంపత్.

ముగింపు:

కొత్తదనం కధలో ఉండాల్సిన అవసరం లేదు…కధనంలో ఉంటే చాలు అని అనుకున్నాడో ఏమో కానీ…కధ మీద కంటే ఎంటర్తైన్మెంట్ తో కూడిన యాక్షన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రవితేజ హావ భావాలను సునాయాసంగా వాడేసుకొని అభిమానులకు కావాల్సిన మీల్స్ అందించాడు దర్శకుడు. మరి ఈ మాస్ మసాలా మూవీ కలెక్షన్లను ఏ విధంగా రాబట్టబోతుందో చూడాలి.

చివరిగా: మాస్ మసాలా వంటకం రొటీనే అయినా..టేస్ట్ మాత్రం కొత్తే!!

రేటింగ్: 3.0/5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com