క’బాలే’ !!

క’బాలే’ !! CoBeM3JXgAANc7N

“సక్సెస్ హేస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈస్ ఆల్వేస్ యాన్ ఆర్ఫన్” – ఇది ఒక ఆంగ్ల నానుడి, అంటే విజయానికి కారణం తామంటే తాము అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఓడినప్పుడు మాత్రం ప్రతి వాడు పక్కన వాడి మీదే తోసేస్తాడు అని అర్ధం. ఇది ప్రతి చోటా ఉండేదే కానీ ఎక్కువగా ఉండేది మాత్రం సినిమాల విషయంలో – ఒక సినిమా హిట్ అయితే హీరోని, ఫెయిల్ అయితే దర్శకుణ్ణి బాధ్యుల్ని చేయటం ఆనవాయితీ. అందుకే నేను సాధారణంగా సినిమా బాగున్నా బాలేకపోయినా దర్శకుడి ఖాతాలోనే వేస్తా. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న రజనీకాంత్ లాంటి నటుడిని తెర మీద చూపించటంలో ‘కబాలి’ సినిమా దర్శకుడు రంజిత్ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. కానీ ‘లింగా’, ‘కోచ్ఛడయాన్’ వంటి దారుణమైన వరుస ఫ్లాపులు ఇచ్చాక కూడా ఇన్ని దశాబ్దాల అనుభవజ్ఞుడైన రజినీకాంత్ ఈ సినిమా కథ, కథనాల్ని ఒప్పుకోవటంలో అతని బాధ్యతారాహిత్యమో లేక అతివిశ్వాసమో ఇంకా ఎక్కువ కనిపించింది.

ఇక అత్యంత భారీ అంచనాలతో నిన్న విడుదలైన  సినిమాలో కథలోకి వస్తే … తమ పూర్వీకుల నుంచీ మలేషియాలో స్థిరపడ్డ తెలుగు/తమిళుడు, పాతికేళ్ల పాటు జైలు జీవితం గడిపి తన ఆదర్శాల్ని, ఆశయాల్ని నడిపిస్తున్న అనుచరుల ఆశల్ని, ఎదురు చూపుల్ని నిజం చేస్తూ బయటకొచ్చిన కబాలీశ్వరన్ అలియాస్ కబాలి కథే ఇది. అసలు కబాలి ఎవరు, ఎందుకు జైలుకెళ్లాడు, తన కుటుంబం ఏమైంది, తిరిగి తన కుటుంబాన్ని కబాలి ఎలా కలుసుకున్నాడు. తన కుటుంబాన్ని నాశనం చేసి జైలుకి పంపిన వాళ్ళ మీద పగా ఎలా తీర్చుకున్నాడు, ఆ పగ తీర్చుకునే క్రమంలో వాళ్లు నడిపిస్తున్న డ్రగ్ మాఫియాను ఎలా అంతం చేశాడు, డ్రగ్స్ మత్తుకు బలైపోతున్న యువతను ఎలా మార్చాడు అనేదే ఈ కథ. ఒక్క మాటలో ఇలా క్లుప్తంగా చెబితే ఒక ఫ్రాన్సిస్ ఫోర్డ్ ‘గాడ్ ఫాదర్’, ఒక ఆర్జీవీ ‘సర్కార్’, ఒక మణిరత్నం ‘నాయకుడు’, ఒక సురేష్ కృష్ణ ‘బాషా’ వంటి సినిమాల రేంజ్ ఉన్న కథ…

కానీ  ….. రంజిత్ ‘కబాలి’ కథనంలోకి వెళ్తే ….

మలేషియా పోలీస్, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూర్చుని పాతికేళ్ల పాటు జైల్లో ఉంటున్న కబాలిని విడుదల చేయటానికి గల కారణాలను చర్చించుకుని, తాను వయసు మళ్ళిన వాడు కనుక ఇపుడు అతను ఎటువంటి ప్రమాదకారి కూడా కాదు అనే నిర్ణయానికి వచ్చి విడుదలకి ఆదేశాలు జారీ చేస్తారు. తోటి ఖైదీల చప్పట్ల మధ్య, పోలీసుల మర్యాదలతో పాతికేళ్ల నుంచి భద్ర పరిచిన తన సూటుబూటుతో భారీ బిల్డప్పు మధ్య విడుదల అయిన కబాలి నేరుగా ఒక చిన్న గ్యాంగ్ స్టర్ దగ్గరకు వెళ్లి తాను పాతికేళ్ల తర్వాత తిరిగొచ్చానని మొత్తం మాఫియాకి సందేశం పంపటంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది డ్రగ్ మాఫియాకు బలైపోతున్న యువతీయువకులను మార్చటం కోసం తన అనుచరుడి ద్వారా కబాలి నడిపిస్తున్న ఫౌండేషన్లోని పిల్లలకు ఇచ్చే ఉపన్యాసంతో తన గతం తెలుస్తుంది. కబాలి డ్రగ్స్ కు అలవాటు పడి గన్ను పట్టుకున్న వాడు కానప్పుడు, డ్రగ్స్ బాధితులకు గన్ను పట్టుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని ఆ కార్యక్రమాన్ని ముగించటంలో అర్ధం బోధపడలేదు.

నిజానికీ గ్యాంగ్ స్టర్ ఎలిమెంట్ తో సినిమా తీసేటప్పుడు అతని పక్కన బలమైన అనుచరులు ఉండాలి, వారి నుంచి ఒక నమ్మక ద్రోహం ఉండాలి – అదీ ఎవరు ఊహించని విధంగా ఉండాలి, తన గతాన్ని బయటపెట్టటానికి బలమైన కారణం ఉండాలి. అటువంటివి ఒకటి ఆరా ఉన్నా కూడా ప్రేక్షకులను కట్టి పడేసే స్థాయిలో లేవు, అలాగే ప్రతిదీ ఊహించిన మలుపులే. ధన్సిక పాత్ర పరిచయం అయ్యే సన్నివేశంలోనే తాను ఎవరు, ఏమిటి, ఏం జరిగుంటుంది అనే విషయం సినిమా ప్రేక్షకులు ఎవరైనా సులభంగా చెప్పేస్తారు. సినిమాలో వచ్చే ఒకో సన్నివేశం నత్త నడకన సాగుతూ ఎక్కడా ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా సాగుతుంది. అటు డ్రగ్ మాఫియా రాకెట్ ఎలా సాగుతుంది, దాని వల్ల నష్టపోతున్న వారు ఎంతమంది, దాని వెనకాలే సాగే వ్యాపారం ఎంత, ప్రభత్వాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి, వాటి మీద తాను ఎలా పోరాటం చేస్తున్నాడు అనే అంశాలతో కూడుకున్న సంభాషణలతో  ఒక్కటంటే ఒక్క బలమైన సన్నివేశం కూడా లేదు.

ఇక రజనీకాంత్ పాత్రీకరణకి వస్తే – సినిమాల్లో అతను ఎలా కనిపించినా నిజ జీవితంలో చాలా సాధారణంగా ఉంటాడు. నిజానికీ నటుడిగా కంటే కూడా అతన్ని ఒక సాదాసీదా వ్యక్తిగా ఎక్కువమంది అభిమానించటానికి కారణం కూడా అదే. అలాంటి రజనీకాంత్ వస్త్రధారణ విషయంలో తన భార్య “నాలుగు చోట్లకు వెళ్తుంటారు, డ్రెస్సు మార్చండి” అంటూ ఇచ్చిన సలహా మేరకు తన పంధా మార్చుకుని సూటుబూటు వేసుకోవటం సినిమా పరంగా బాగుంటుంది కానీ. “విలువ మనిషికి ఉండాలి, వేసిన బట్టలకు కాదు లాంటి”  లాంటి రజనీ మార్కు డైలాగే లేకపోవటం నిరాశ కలిగించే అంశం. దానికి తోడు తన గతాన్నంతా విన్న పిల్లలో ఒకడు “నువ్వు రాత్రి పూట కూడా సూటేసుకుని పడుకో అన్నా .. ఎవరొచ్చినా నేను చూస్కుంటా” అనటంతో అసలు ఈ బాధంతా సూటుబూటు కోసమా అనిపించేంత వెటకారంగా ఉంది. అలాగే రజనీ పక్కన ఉండే జీవా అనే కుర్రాడు రజనీ నడవటానికి దారి చేసే క్రమంలో అనవసరంగా అత్యుత్సాహంతో  పిల్లలతో, స్త్రీలతో దురుసుగా ప్రవర్తించటంపై రజనీ పాత్ర గమనించి కూడా  స్పందించకపోవటం, తన ఫౌండేషన్లో ఉండే ఒక యువతికి డ్రగ్స్ చూపి లొంగతీసుకోవాలని ఒక యువకుడు ప్రయత్నిస్తుండటాన్ని కిటికీ లో నుంచి చూస్తూ ఏమి చేయకుండా ఉండటం వంటివి అర్ధరహితం. అంత పెద్ద డాన్ తన భార్య కోసం వెతుకుతూ తన కూతురితో పాటు ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుంచి హోటల్ గదిలో బెల్లు మోగితే భయపడుతూ ఉండటం అభిమానులు కాస్త జీర్ణించుకోవటం కష్టం. తన భార్య బతికుంది అని తెలుసుకున్న కబాలికి వెంటనే వచ్చే విచిత్ర ఆలోచన – తన భార్యను తీసుకొచ్చి ప్రతినాయకులకు చూపించి తనని, తన కుటుంబాన్ని ఏం చేయలేకపోయారని చూపించాలి అనటమే సినిమాలో ఉన్న ఏకైక కామెడీ.

రజనీ అంటే ఇలాగే ఉండాలా ? అలాగే చేయాలా ? కొత్తగా ప్రయత్నించకూడదా ? ఇమేజ్ నుంచి బయటకు రాకూడదా ? రానీయరా ? అసలు “అన్ని అంచనాలతో సినిమాలకి వెళ్ళటం ప్రేక్షకుల తప్పు, సినిమాది కాదు” అని వాదించే వారికి ఇది – ఈ సినిమా పెద్ద ప్రయోగం కాకపోయినా అలా కొత్తగా ఏమైనా చేయాలనిపిస్తే తన సొంత నిర్మాణంలో, సొంతంగా విడుదల చేసుకోవాలి.

నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, సంగీతం అంతంత మాత్రమే, రాధికా ఆప్టే, ధన్సిక బాగా చేశారు.

చివరగా: ఈ సినిమాను కొంత మంది మహేష్ ‘బ్రహ్మోత్సవం’తో పోలుస్తున్నారు(బహుశా ఫలితంతో పోలికేమో) కానీ నిజానికీ ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ ఎటువంటి సహాయం లేకుండా చాలా మంది బీరకాయ పీచు చుట్టాలనే కలిశాడు. కానీ ఇంత పెద్ద డాన్ అయినా ‘కబాలి’ మాత్రం తన భార్యను కలవటానికి చాలా మంది ఆకు రౌడీల సహాయంతో ఎంతో కష్టపడి కలిశాడు.

కబాలి నాకు నచ్చనప్పటికీ, రజనీ వరుస పరాజయాల పరంపరలో ఈ సినిమా పంపిణీదారులు కూడా రోడ్డు మీదకి ఎక్కకుండా అర్థరహితమైన సినిమాలు ఎన్నో ఆడుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా కూడా ఎలాగోలా ఆడితే ….

‘మంచిది’ !! 

రజనీ మీద ఉన్న గౌరవంతో ఇంత ఆలస్యంగా ఈ రివ్యూని ప్రచురిస్తున్నా..

– రావూరి 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com