పూరి-వరుణ్ ‘లోఫర్’ రివ్యూ

ముఖ్య తారాగణం: వరుణ్‌ తేజ్‌, దిషా పాట్ని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, ఆలీ, సప్తగిరి, ధన్‌రాజ్‌ తదితరులు
బ్యానర్‌: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సివి రావు
కథ, స్కీన్-ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాధ్‌

కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన ఆ దర్శకుడికి మాస్ హీరో అనిపించుకోవడానికి తహతహ లాడుతున్న మెగా యువ హీరో వరుణ్ తేజ్ దొరకడం… ఆ వెంటనే ఓ నెగటివ్ టైటిల్ ను ఫైనల్ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడం…ఇక ఇప్పుడుప్రేక్షకుల ముందుకి తేవడం…అన్నీ చకా చకా జరిగిపోయాయి. మరి ఈ ‘లోఫర్’ ఏ మేర ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కధేంటి ?

సంపన్న కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మి (రేవతి) తాను ప్రేమించిన వాడి కోసం (పోసాని కృష్ణ మురళి) సొంత కుటుంబానికే దూరమవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత తను నమ్మిన వ్యక్తి ఓ లోఫర్ అని తెలిసి అతనికి దూరమవ్వాలనుకుంటుంది. తనతో పాటుగా తన కొడుకు రాజా (వరుణ్ తేజ్)ను కూడా అతడికి దూరంగా పెంచాలనుకుంటుంది. అయితే ఈ లోగా రాజాను తీసుకొని జోధ్ పూర్ పారిపోతాడు. జాండీస్ తో తల్లి చనిపోయిందని రాజాను నమ్మించి దొంగతనాలు, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఓ లోఫర్ గా తయారు చేస్తాడు.

ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోయి జోద్ పూర్ వస్తుంది మౌని (దిశా పటాని). ఆమె బ్యాగ్ ను రాజా కొట్టేయడం…ఆ తరువాత ప్రేమలో పడడం జరిగిపోతాయి. అయితే మౌని అత్తకు రాజా నచ్చకపోవడం…ఆమె అత్తే రాజాకు కన్న తల్లి అవడం…అది తెలుసుకున్న రాజా తనను అసహ్యిన్చుకుంటున్న ఆమె తెల్లికి ఎలా దగ్గరయ్యాడు? మౌనిని ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కధ.

నటనా ప్రతిభ:

వరుణ్ కి ఇది మూడో సినిమానే అయినా…కమర్షియల్ యాంగిల్ ని ఎలివేట్ చేయడానికి ఈ పాత్ర అతనికి దోహదపడింది. మరో పక్క సెంటిమెంటునూ బాగా పండించగలననే నమ్మకాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చాడు వరుణ్. మొత్తమ్మీద మాస్ ఆడియన్స్ ని మెప్పించడంలో సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి. ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన రేవతి తన సహజత్వాన్ని నటనలో చూపించింది. ముఖ్యంగా తల్లి పాత్రను గురించి చెప్పే సన్నివేశం బాగా ఆకట్టుకుంది. దిశా పటానిది గ్లామర్ రోల్ మాత్రమే కాబట్టి నటన గురించి పెద్దగా ప్రస్తావిన్చుకోవాల్సిన అవసరం లేదు. పాటల్లో ఆమె తన అందాల్ని బాగానే చూపించింది. పోసానికి ఇలాంటి లోఫర్ క్యారెక్టర్ లు కొత్తేమీ కాదుకాబట్టి తన దైన శైలిలో లాగించేశాడు.

విలన్ పాత్రలో చేసిన ముఖేష్ రుషి పరవాలేదు. కామెడీ విషయానికి వస్తే…తమ్ముడు స్పూఫ్ తో కొంత మేర నవ్వించగా బ్రహ్మనందం, సప్తగిరి పరవాలేదనిపించారు.

టెక్నికల్ టీం:

సంగీతాన్ని సమకూర్చిన సునీల్ కశ్యప్ తన బాణీలను పూరి సినిమాకు తగ్గట్టు అందించిన్చారని చెప్పుకోవచ్చు. మొత్తమ్మీద పరవాలేదనిపించుకున్నాడు. ‘సువ్వీ సువ్వాలమ్మా’ కొంత కాలం పాటు గుర్తుండిపోయే పాటగా చెప్పుకోవచ్చు. పి.జి.విందా ఛాయాగ్రహణం బాగానే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు పరవాలేదు. ఇక దర్శకుడి విషయానికి వస్తే…అనుకున్న మూల కధలో (మదర్ సెంటిమెంట్) పట్టున్నప్పటికీ దాన్ని మిగతా క్యారెక్టర్ లకు అల్లిన తీరుతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా పేవలంగా అనిపిస్తుందని చెప్పక తప్పదు. వరుణ్ ఎనర్జీ, మదర్ సెంటిమెంట్ సన్నివేశాలతో పాటు సింగల్ లైన్ పంచ్ డైలాగ్ లతో నెట్టుకొచ్చారు తప్పితే మిగతాది పూరి బ్రాండ్ కు తగ్గట్టు లేదనే చెప్పాలి.

ముగింపు:
కమర్షియల్ హీరోగా ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో వరుణ్ మరిన్ని మాస్ క్యారెక్టర్లు చేసే అవకాసం ఉండొచ్చు. ఈ సినిమాతో మాస్ లోనూ పాస్ అయ్యాడు వరుణ్. స్క్రీన్ ప్లే లో డొల్లతనం, మరి కొంత అయోమయం తో పూరి ఇబ్బంది పడ్డట్లు అవగతంఅవుతుంది. మరి కమర్షియల్ గా ఏ మేర ఈ సినిమా రానిస్తుందో రాబోయో రోజుల్లో తేలిపోతుంది.

చివరిగా: మాస్ లోనూ పాసయ్యాడు ఈ మెగా యువ హీరో!!

రేటింగ్: 2.75/5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com