హాయిగా సాగిన “పెళ్లి చూపులు”..!!

హాయిగా సాగిన “పెళ్లి చూపులు”..!! Cond6KfUkAA7fcB

హాస్యం అంటే అనవసరమైన ప్రాసలు, పనికిమాలిన పంచు డైలాగులు, ఆడవాళ్ల మీద స్థాయి మరిచి దిగజారుడు కామెంట్లు, కుళ్ళు జోకులు, మానవ విలువలంటే కేవలం ఆస్తులు అన్నట్టు సాగుతున్న మన నేటి తెలుగు సినిమాలో ఒక చక్కని కథకు, ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి వెండితెర మీద నేటి యువతరం ఆలోచనలకు, ఆశయాలకు, సొంతవ్యక్తిత్వానికి – తల్లితండ్రుల ఆశలకి మధ్య సాగే జీవితానికి ముడిపెడుతూ, అందంగా చిత్రీకరించిన సినిమా “పెళ్లి చూపులు”. ఎన్ని స్క్రీన్లలో సినిమా విడుదల చేశామా, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎన్ని కోట్లు తిరిగోచ్చాయా అని మాత్రమే లెక్కలేసి సినిమా విజయాన్ని బేరీజు వేస్తున్న ఈ రోజుల్లో, దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానంలోనే ఇది అందరికీ నచ్చాలి అనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక కథలోకి వెళ్తే … చచ్చీ చెడి ఇంజినీరింగ్ పాస్ అయి, కాళీగా తిరుగుతూ చివరికి వంటవాడు అవ్వాలనుకునే  ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)కి, బాగా చదువుకుని, డబ్బులు సంపాదించి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అనే ఆశయాలు కలిగిన చిత్ర (రీతు వర్మ)కు అనుకోకుండా జరిగే పెళ్లి చూపులు, అవి ఎక్కడికి దారి తీశాయి, తరువాత ఏం జరిగింది, వాళ్లిద్దరూ అనుకున్నట్టే స్థిరపడ్డారా ? లేదా అనేదే ఈ ‘చిన్న’ సినిమాలోని చిన్న కథ. ఈ కథను నడిపిన తీరు, విరామానికి ముందు వచ్చే మలుపు, కథలోని ప్రతీ పాత్రకు ఒక పాత్రీకరణ, సరదాగా సాగే సంభాషణలు, పతాక సన్నివేశాల్లోని భావోద్వేగాలు కొత్తదనంతో,  ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

నాటకీయ పరిణామాల మధ్య పెళ్లి చూపుల్లో ఒక గదిలో ఇరుక్కుపోయిన అబ్బాయి, అమ్మాయి తమ తమ ఇష్టాఇష్టాలతో పాటు గతంలోని తమ ప్రేమకథల్ని, మోసపోయిన విషయాల్ని, డబ్బులు సంపాదించటానికి స్నేహితులతో కలిసి హీరో పడిన పాట్లు, వ్యాపారం కోసం ఒక అబ్బాయిని నమ్మి హీరోయిన్ నష్టపోయిన విషయాల్ని చర్చించుకునే ఎపిసోడ్ తోనే  ప్రధమార్ధం మొత్తం గడిచిపోయినా అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అనిపించేంత సరదాగా కథను నడిపించారు దర్శకుడు. ధనికురాలైన అమ్మాయిని పెళ్ళిచేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలనుకునే ప్రశాంత్ అనివార్య కారణాల వల్ల చిత్ర మొదలుపెట్టిన వ్యాపారంలో  పనివాడిగా చేరటంతో  మొదలయ్యే ద్వితీయార్ధం – చివరి వరకు ఒక వైపు తమకే తెలియకుండా చిత్ర, ప్రశాంత్ లు ఒకరినొకరు ఇష్టపడటం, మరో వైపు తన కొడుకు జీవితంలో స్థిరపడాలని, తన కూతురు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకునే ఇద్దరు మధ్యతరగతి తండ్రులు, తన ఏకైక కూతురికి తన వ్యాపారాన్ని మొత్తాన్ని చూసుకోగల అల్లుడిని తీసుకొచ్చి కట్టపెట్టాలనే ఒక వ్యాపారధోరణి కలిగిన ధనికుడైన తండ్రి ఆలోచనల మధ్య మంచి భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుంది. ఇటువంటి కథలకు సాధారణంగా ఏ విమానాశ్రయాన్నో, రైల్వే స్టేషన్నో నేపధ్యంగా ఎంచుకుని సాగదీత ధోరణిలో ముగింపునివ్వకుండా కొంచెం అసహజమే అయినప్పటికీ అంగీకరించే విధంగానే శుభం కార్డు వేశారు.

ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటన చాలా సహజంగా ఉంది, బాగుంది. హీరో పక్కన ఉండే ఇద్దరు స్నేహితుల్లో కౌశిక్ పాత్రధారి ప్రియదర్శి నటన సినిమాకే హైలైట్ – తెలంగాణా మాండలీకంలో అతను చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్లలో బాగా పేలాయి. దర్శక రచయిత తరుణ్ భాస్కర్ అందించిన సంభాషణలు సినిమాకు ప్రాణం – పెద్ద పెద్ద వ్యాసాలు రాయకుండా, మనం రోజూ మాట్లాడుకునే మాటలతో చాలా లోతైన విషయాల్ని చెప్పాడు – ఉదాహరణకి అబ్బాయి పుట్టలేదని అమ్మాయిని తక్కువగా చూడటం అనే విషయం మీద చిత్ర తండ్రితో ప్రశాంత్ మాట్లాడే సన్నివేశంలోనివి, ప్రశాంత్ ఇష్టాన్ని ప్రోత్సహించమని ప్రశాంత్ తండ్రిని చిత్ర కలిసే సన్నివేశంలోనివి. హీరో తండ్రి పాత్రలో నటించిన కేదార్ శంకర్, హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన గురురాజ్ మానేపల్లి, బిజినెస్ మాన్ పాత్రలో నటించిన అనిష్ కురువిల్లాలు చాలా బాగా చేశారు. వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, సౌండ్ సిస్టం కాస్త మెరుగ్గా ఉండాల్సింది – చాలా చోట్ల డైలాగుల్లో స్పష్టత లేదు (అది థియేటర్లో సమస్య కూడా కావచ్చు). హాస్యం కోసం హీరో మిత్రులు ఒకరిని ఒకరు అనవసరంగా చెంపల మీద కొట్టటం లాంటివి లేకపోవటం ఒక పెద్ద రిలీఫ్ కానీ మందు కొట్టే సన్నివేశాలు, మందు చుట్టూ డైలాగులు కొన్ని తగ్గించుంటే సినిమా మరింత హుందాగా ఉండేది.

మూడు రోజుల కలెక్షన్ల కోసమే అన్నట్టుగా సినిమాలు విడుదల అవుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా కొన్ని వారాలు పాటు ఉంటుంది…కనుక ఇంటిల్లిపాదీ కలిసి ఈ ఆదివారమో, ఆ పై ఆదివారమో, పై పై ఆదివారమో ఒక మంచి సినిమాకు వెళ్లాలనుకుంటే “పెళ్లి చూపులు” సినిమాకు ధైర్యంగా వెళ్ళచ్చు …

– రావూరి    

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com