‘నాన్నకు ప్రేమతో’ రివ్యూ

ముఖ్య తారాగణం: ఎన్టీఆర్, రకుల్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్ తదితరులు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి
మాటలు: బుచ్చిబాబు, శ్రీనివాస్, విక్రం
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్

మాస్ ఇమేజ్ ఉన్న హీరో…క్లాస్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ కలిసి ఓ సినిమాను తెరకెక్కించడానికి పూనుకుంటే….ఆ సినిమా కి వచ్చే హైప్ సంగేతేమో గానీ… అసలు ప్రోడక్ట్ ఏ మేర ప్రేక్షకుల అంచనాలను అందుకోగలదో అన్న సందేహాలు రావడం మాత్రం తధ్యం. కానీ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు మాత్రం హైప్ తో పాటు మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను, క్లాస్ ఇమేజ్ ఉన్న సుకుమార్ ఏ మేర రెడీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తారో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్న నేపధ్యంలో అనుకున్న సమయానికి సంక్రాంతి బరిలో దించింది యూనిట్. అభిమానుల సందేహాలకు ఏ మేర ఈ సినిమా సమాధానం ఇచ్చిందో చూద్దాం!.

కధేంటి ?

అభిరామ్ (ఎన్టీఆర్), తన తండ్రిని (రాజేంద్రప్రసాద్‌) మోసం చేసిన కృష్ణమూర్తి పై (జగపతిబాబు) పగ తీర్చుకోవడమే స్టొరీ కోర్ లైన్. దీని చుట్టూ హీరో, విలన్ ల తెలివి తేటలు, మైండ్ గేమ్ తో నడిచేదే మిగతా కధ. కృష్ణ మూర్తి చేతిలో తన తండ్రి ఎలా మోసపోయారు? మోసం చేసిన కృష్ణ మూర్తిని అభిరామ్ ఎలా దెబ్బ కొట్టాడు? అనే అంశం చుట్టూత తిరిగే కధే ‘నాన్నకు ప్రేమతో’.

ఎవరెలా?

నటనా పరంగా ఎన్టీఆర్ చూపించిన వైవిధ్యానికి మంచి మార్కులే వేయొచ్చు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలతో పోలిస్తే నటనలో ఓ కొత్త మార్క్ ను సెట్ చేయాలనే తపన ఈ సినిమాలో చూపించారు ఎన్టీఆర్. ముఖ్యంగా జగపతి బాబుతో సంభాషణలు, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్ష్ లో ఎమోషన్ సీన్లలో తన నటనలో చూపించిన వ్యత్యాసం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశాలు.

రకుల్ ప్రీత్ అన్ని విభాగాల్లో నూ బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమెనే సొంతగా డబ్బింగ్ చెప్పుకొని ఆకట్టుకోవడం విశేషం. ప్రతి నాయకుడి పాత్ర చేసిన జగపతి బాబు ఈ చిత్రానికి పెద్ద అసెట్ గా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ పాత్రకు వెయిట్ వచ్చిందంటే…అది జగపతి బాబు ప్రతి నాయకుడి స్థానంలో చేసిన పవర్ఫుల్ రోలే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక కధ రాజేంద్ర ప్రసాద్ చుట్టూ తిరిగినప్పటికీ…ఆయన నటనకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.

మిగిలిన పాత్రల్లో చేసిన మధుబాల, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, తదితరులు తమ పరిధి మేర పరవాలేదనిపించుకున్నారు.

టెక్నికల్ టీం:

దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు బాగానే ఆకట్టుకున్నప్పటికీ…పాటలు మాత్రం కధకు స్పీడ్ బ్రేకర్ల లాగా అడ్డుపడ్డాయి. నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. విజయ్ చక్రవర్తి ఛాయాగ్రహణం ప్రశంశనీయం. నిర్మాణ విలువలకు డోకా లేదు. దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే …ఇంతక ముందు సినిమా మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ దర్శకుడిగా మరోసారి తన వైవిధ్యాన్నే నమ్ముకున్నారు. అయితే ఈ సారి లాజిక్కు మిస్ కానీయకుండా కొంచం జాగ్రత్త పడ్డారు.

ముగింపు:

సంక్రాంతికి వచ్చే సినిమా అంటే బోలెడంత ఎంటర్టైన్మెంట్ ను సగటు తెలుగు ప్రేక్షకుడు కోరుకోవడం సహజమే. అయితే ఈ సినిమాలో కొత్తదనమైతే ఉంది కానీ కాసులు కురిపించే ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా ఎలాంటి ప్రభావం చూపించబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు తోడు మరో మూడు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

మొత్తమ్మీద…సుకుమార్-ఎన్టీఆర్ ఓ కొత్త దనంతో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించారు.

చివరిగా: సుకుమార్ మార్క్ ‘కొత్తదనం’!!

రేటింగ్: 3.25/ 5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com