ఒక మనసు – ఒక జ్ఞాపకం

ఒక మనసు – ఒక జ్ఞాపకం ClDb00pVAAAs6b6

ఒక మనసు – కొడుకు భవిష్యత్తు మీదే ఆశలు పెట్టుకున్న ఒక నాన్నది.
ఒక మనసు – కూతురి పెళ్లి కోసం తపన పడే ఒక అమ్మది.
ఒక మనసు – తండ్రి తన మీద పెట్టుకున్న ఆశలకి, ప్రేయసికి మధ్య నలిగే ఒక అబ్బాయిది.
ఒక మనసు – ప్రియుడి లక్ష్యానికి తన ప్రేమకి మధ్య వేదన పడే అమ్మాయిది.
ఒక మనసు – ఈ నాలుగు పాత్రల మధ్య ఒక అందమైన ప్రేమకథని నడిపిన దర్శకుడు రామరాజుది.

కథలోకి వస్తే – ఎమ్మెల్యే అవ్వాలనుకునే కథానాయకుడు సూర్య, ఎంబీబీఎస్ చదివే కథానాయకి సంధ్య ఒకానొక సందర్భంలో ప్రేమలో పడతారు. ఊర్లో ఎప్పుడూ గొడవలు పడుతూ, లాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఉండే సూర్య పద్దతి తనకి నచ్చకపోయినా, ఒకింత అభద్రతాభావానికి గురైనా కూడా సూర్య మీద ఇష్టంతో, సంధ్య అడ్డు చెప్పలేకపోతుంది. ఇలాంటి గొడవల్లో ఒక సారి ఒక మిత్రుడి నమ్మకద్రోహం వలన సూర్య జైలుకెళతాడు. తన తండ్రి ఎంతో కష్టపడి బెయిల్ మీద కొడుకుని అయితే తీసుకొస్తాడు కానీ కేసు నుంచి తప్పించలేకపోతాడు. ఆ కేసు నుంచి సూర్యని తప్పించటానికి తన తండ్రి చేసే ప్రయత్నాలు, అవి సూర్య సంధ్యల ప్రేమ మధ్య ఎలాంటి పరిస్థితులు కలగజేశాయి. ఆ పరిస్థితుల నుంచి చివరికి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే ఈ కథ.

ఇక కథనంలోకి వస్తే సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా చాలా నెమ్మదిగా సాగుతుంది. దాదాపు ప్రతి సన్నివేశంలోనూ సూర్య, సంధ్యలే కనిపిస్తుంటారు. ఎటువంటి వాణిజ్య పరమైన సన్నివేశాలు, సంభాషణలు లేకుండా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే ఒక సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రీకరణల్లో మన ఇంట్లో, మన వీధిలో, మన చుట్టూ కనిపించే వ్యక్తులే కనిపిస్తారు. చాలా సాధారణమైన మాటలతో ప్రేమికుల మధ్య ఎంతో హృద్యంగా, మిగిలిన పాత్రలతో మన సమాజం గురించి ఆలోచింపజేసే విధంగా ఎంతో లోతైన సంభాషణలు వ్రాసారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా సూర్య సంధ్యల మధ్య ఉన్న ప్రతి సన్నివేశంలో దర్శకుడిలోని భావుకత కనిపిస్తుంది, ప్రతి సంభాషణలో దర్శకుడిలో ఒక కవి కనిపిస్తాడు. రెండున్నర గంటల పాటు ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కామెడీ సన్నివేశాలతో సాగే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాని చాలా ఓపికగా చూడాల్సి వస్తుంది. నిజానికి చివరి ఇరవై నిముషాల సన్నివేశాలు సినిమాలో ఇప్పుడున్నట్టు కాకుండా ఇంకెలా ఉన్నా కూడా ఈ సినిమాకి ఏ మాత్రం అర్ధం ఉండేది కాదు.

నటీనటుల విషయానికి వస్తే ఇప్పటి వరకు నాగశౌర్య చేసిన సినిమాల్లో అన్నిటికన్నా ఇందులో నటించటానికి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర ఇదే అని చెప్పచ్చు, ఆ అవకాశాన్ని అతడు నూటికి నూరు పాళ్ళు సద్వినియోగం చేసుకున్నాడు. “ముద్దపప్పు-ఆవకాయ” పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ సీరియల్లో ఒక నేటి తరం చలాకీ, టామ్ బాయ్ లాంటి అమ్మాయిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిహారిక తన తొలి చిత్రంలోనే ఇంత బరువైన పాత్రని చేయటం నిజంగా సాహసం, ఆ పాత్రకి తను న్యాయం చేసింది. ద్వితీయార్థం మొత్తం నిహారిక చీరకట్టులో కనిపించటంతో తన వయసు కన్నా పెద్ద అమ్మాయి లాగా కనిపిస్తుంది. నాగశౌర్య తండ్రి పాత్రలో రావు రమేష్, నిహారిక తల్లి పాత్రలో ప్రగతి చాలా బాగా నటించారు. నాగినీడు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాజా రవీంద్ర, హేమంత్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది – సముద్ర తీరంలో ఒక ఇల్లు, చాలా సన్నివేశాలు విశాఖ చుట్టు పక్కల ఉన్న మన్యం ప్రాంతాల్లోని ఎంతో అందమైన లొకేషన్లని తెర మీద బాగా చూపించారు. సునీల్ కాశ్యప్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి.

ఒక్క మాటలో …

సాధారణంగా సినిమాలు చూస్తాం – మర్చిపోతాం ..

కానీ కొన్ని సినిమాలు చూసినపుడు మాత్రం ఒక అనుభూతికి లోనవుతాం, గుర్తుంచుకునేస్తాం, నిజానికి అలా గుర్తుండిపోతాయి – ఈ కోవలోకి వచ్చే సినిమా … ‘ఒక మనసు’ …

– రావూరి

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com