జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్ – ‘జ్యో అచ్యుతానంద’ !!

జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్ - 'జ్యో అచ్యుతానంద' !! జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్ – ‘జ్యో అచ్యుతానంద’ !! Regina Special Jyo Achyutananda Posters 4

నేనేదో పెద్ద బ్లాగర్ అనో, లేక నలుగురూ ఆధారపడదగ్గ అభిప్రాయాన్ని చెబుతా అనో కాకపోయినా… నేను రాసింది చదివే వాళ్లలో ఒక ఇరవై మంది కూడా ప్రభావితమై సినిమా మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు అనే ఉద్దేశంతో, నేను సాధారణంగా సినిమా విడుదల అయిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత ఇక్కడ నా అభిప్రాయాన్ని రాసి ప్రచురిస్తుంటాను.

అలాగే ఈ సినిమాకు కూడా కాస్త ఆలస్యంగా …. 

అచ్యుత్ రామారావు (నారా రోహిత్), ఆనంద్ వర్ధన రావు(నాగ శౌర్య) ఇద్దరూ అన్నదమ్ముల. ఒక మధ్యతరగతి కుటుంబం, తండ్రి ప్రభుత్వోద్యోగి. తమ ఇంటి పై వాటాలో తన తండ్రితో కలిసి అద్దెకు దిగే యువతి  జ్యోత్స్న(రెజీనా కసాండ్ర). అన్నదమ్ములిద్దరూ ఆ అమ్మాయితో స్నేహం చేసి ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమిస్తారు. ఇద్దరినీ జ్యోత్స్న నిరాకరిస్తుంది. జ్యోత్స్ననిరాకరించినందుకు అచ్యుత్ ఆక్రోశంలో చేసే ఒక పని వల్ల అందరూ ఇబ్బందులకు గురవుతారు. జ్యోత్స్న ఈ విషయాలన్నీ వదిలిపెట్టి పై చదువులకు అమెరికాకు వెళ్తుంది. ఆ కారణంగా ఇద్దరి అన్నదమ్ముల మధ్య వచ్చే పొరపొచ్చాలు విదేశాల నుంచి తిరిగొచ్చిన జ్యోత్స్న ఎలా చక్కబెట్టింది ? తిరిగి ఆ అన్నదమ్ములు ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈ చిత్ర కథ. జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్ – వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే కథ కావటంతో ఈ సినిమా టైటిల్ ‘జ్యో అచ్యుతానంద’ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక కథనం విషయానికి వస్తే … “ఊహలు గుసగుస లాడే” సినిమాలో  ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలు, సంభాషణలతో ఒక సాఫీగా సాగిపోయే సినిమాను చేసిన అవసరాల శ్రీనివాస్ అదే పంథాను ఇందులోనూ కొనసాగించాడు. ఇద్దరు హీరోలూ పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డట్టుగా చూపించటంతో సినిమాను ప్రారంభించటం బాగుంది. తర్వాత ఒకే సన్నివేశం రెండు మూడు సార్లు రావటం ప్రేక్షకులు కాసింత అసహనానికి లోనయినా సరదాగా కథలోకి చేరుకోవటంతో సర్దుకుంటారు. ఈ సినిమాలో ప్రేమకథ కన్నా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ పొరపొచ్చాలు – వాటిని చక్కబెట్టేందుకు ఎంచుకున్న సన్నివేశాలు హృద్యంగా, సహజంగా సాగుతాయి. సినిమా టైటిల్,ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యుండచ్చు అనుకునే ప్రేక్షకులు సినిమాకు వెళ్తారు. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు చేరటానికి కొంచం సమయం పడుతుంది కనుక ఇది ఒక రకంగా సినిమా ఫలితం మీద ప్రభావం చూపించేదే అవుతుంది. ద్వితీయార్థం కాస్త నెమ్మదిస్తుంది, అక్కడక్కడా కథ నుంచి ఎటో వెళ్తున్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. పతాక సన్నివేశం, ఆ సన్నివేశంలో వచ్చే సంభాషణలు ఈ సినిమాకు ప్రాణం !!

ఇక నటన విషయంలో ప్రతి ఒక్కరికి నూటికి నూరు మార్కులు వేయచ్చు. రోహిత్, నాగశౌర్య తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.కథల ఎన్నికలో ముందు నుంచి ఒక జాగ్రత్త పాటిస్తూ విభిన్నమైన అంశాలను ఎంచుకుంటున్న నారా రోహిత్, కాస్త తన శరీరం మీద కూడా శ్రద్ధ చూపెడితే మంచి నటుడు అవుతాడు. నిజానికి దీనికి, నటనకు సంబంధం లేకపోయినా తన స్వరం, వాచికం బాగున్నా కూడా తన ముఖకవళికలు ప్రేక్షకులకు కనిపించే అవకాశం ఇవ్వకుండా తన బుగ్గలే అడ్డుపడుతున్నాయి.  నాగశౌర్య చక్కగా ఉన్నాడు, పాత్రకు తగ్గట్టుగా ఇంటి చిన్న కొడుకులాగే చిన్న పిల్లాడిలా ఉన్నాడు. రెజీనాకు కేవలం పాటల కోసం కాకుండా నటించటానికి ఆస్కారం ఉన్న పాత్ర, చాలా అందంగా ఉంది – అంతే అందంగా నటించింది కూడా. ఇక హీరోల తల్లి పాత్రలో సీత, హీరోయిన్ తండ్రి పాత్రలో తనికెళ్ళ భరణి బాగా నటించారు. దంత వైద్యుడి పాత్రలో చాలా కాలానికి అశోక్ కుమార్ కనిపించారు, బాగా చేశారు. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిల్లో బాగా చేశారు. ఒక చిన్న పాత్రలో శశాంక్, అతిధి పాత్రలో నాని కనిపిస్తారు.

సాంకేతిక పరమైన అంశాల్లో చెప్పుకోవాల్సింది ఈ సినిమాకు ప్రధాన బలం సంభాషణలు – తెలుగు భాష మీద శ్రీనివాస్ అవసరాలకు ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. గత చిత్రంలో తన ప్రేమను తెలియజేయటానికి “మిమ్మల్ని చూడగానే కచటతపలు అన్నీ గజడదవలు అయిపోయాయి” అంటూ పరుషసరళముల ప్రస్తావన తీసుకొచ్చినట్టుగానే ఇందులో రెజీనా సరదాగా రోహిత్ ను పిలవటాన్ని కూడా ‘సంబోధనా ప్రధమా విభక్తి’తో ఉదహరించటం బాగుంది. తెలుగు విభక్తులు తెలిసిన వాళ్ళు, ఇంకా మర్చిపోని వాళ్ళు అర్ధం చేసుకుని, సరదాగా నవ్వుకుంటారు. తెలుగు వ్యాకరణం తెలియని వాళ్లు, అసలు తెలుగు ఒక పాఠ్యాంశంగా కూడా లేని వాళ్ళు, ఇవి ఏవిటి అని ఆలోచించగలిగినా కూడా రచయితగా శ్రీనివాస్ సఫలీకృతుడు అయినట్టే.

అన్నదమ్ముల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య, తల్లీ కూతుళ్ళ మధ్య, తండ్రీ కూతుళ్ళ మధ్య వచ్చే సంభాషణలు అన్నీ చాలా బాగుంటాయి. ప్రేక్షకులు ఒక హృద్యమైన అనుభూతికి లోనయ్యేంత బాగుంటాయి. ఇక హాస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎటువంటి అసభ్యమైన పదజాలం లేకుండా, ఎటువంటి ద్వంద్వార్ధాలు లేకుండా హాయిగా సాగిపోతుంది.”మిస్టర్ సాగర్ .. జ్ఞాన దంతానికి, జ్ఞానానికి అస్సలు సంబంధం లేదు – మీరు దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు”, “ఎనిమిది రూపాయలకు ఇన్ని ఇస్తున్నాడంటే వాడు దేవుడు రా” వంటివి కడుపుబ్బా నవ్విస్తాయి.

“ఇళయరాజా పాటలు వింటేనే మ్యూజిక్ సిస్టం ఎలా ఉందో తెలుస్తుందమ్మా !” అనే డైలాగ్ తో సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు ఇళయారాజా అని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమాలో పాటలు, నేపధ్య సంగీతం బాగుంది – హీరోయిన్ పేరు జ్యోత్స్న అయినపుడు మొదటి పాట ‘సువర్ణ’ అంటూ ఎందుకు సాగింది అనేది అర్ధం కాలేదు. మిగతా పాటలన్నీ కూడా వినసొంపుగా సాగుతాయి. ‘ఒక లాలన’ పాట విన్నాక కలిగిన మొదటి అభిప్రాయం – పదేళ్ళ తర్వాతైనా హాయిగా వినగలిగే పాటలు ఒక్క కల్యాణి మాలిక్ అలియాస్ కల్యాణ రమణవి మాత్రమే అని !!

కథ గురించి ముందుగా ఏ ఊహలూ లేకుండా ఈ సినిమాకు వెళ్ళే ప్రేక్షకులు మాత్రం ఒక చక్కని అనుభూతికి లోనై బయటకు వస్తారు …

– రావూరి 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com