జనతా గ్యారేజ్ …

జనతా గ్యారేజ్ ... జనతా గ్యారేజ్ … janatha garage movie audio songs track list posters 4557fef

అనగనగా ఒక  రాజు .. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులు … చేపలు పట్టటానికి వెళ్లారు – ఇది మన కథ … అనగనగా ఒక గాడ్ ఫాదర్ .. ఆ గాడ్ ఫాదర్ గారికి ముగ్గురు కొడుకులు .. ఇది మేరియో పూజో కథ. ఈ గాడ్ ఫాదర్ నవలలోని ప్రతి పేజీని చదివి చించేసి, గాడ్ ఫాదర్ సినిమాలోని ప్రతి పాత్రతో కలిసి జీవించేసిన దర్శకనిర్మాతలు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ. సినిమా బడ్జెట్టుకు అనుగుణంగా గాడ్ ఫాదర్ కొడుకుల సంఖ్యను ఒకటి నుంచి మూడు దాకా చాలా సినిమాలు చేసేసారు. తండ్రీ కొడుకుల మధ్యే కాకుండా ఇదే కథను అన్నదమ్ముల మధ్య కూడా నడిపారు. అలా చేసిన చాలా సినిమాల్లో అమితాబ్ ‘సర్కార్’ ఒకటి – ఆ కథను కొరటాల శివ మరో రకంగా ‘పార్క్’ చేసిన ప్రయత్నమే ఈ ‘జనతా గ్యారేజ్’.

ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న శివ (రెహమాన్) తన కుటుంబం తనతో  పాటే ఉండాలని పెంచి పెద్ద చేసిన అన్నయ్య సత్యం (మోహన్ లాల్)ను, కుటుంబాన్ని తమ ఊరి నుంచి హైదరాబాద్ పిలుచుకొస్తాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన సత్యం ‘జనతా గ్యారేజ్’ పేరుతో మెకానిక్ షెడ్ ప్రారంభించి తన జీవనాన్ని సాగిస్తుంటాడు. అతని దగ్గర పని చేసే వాళ్ళందరినీ తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ ఉంటాడు. గ్యారేజీలో తన పాత మోపెడ్ బాగు చేయించుకోటానికి తరచూ వచ్చే ఒక వృద్దుడికి, తన కుటుంబానికి  జరిగిన అన్యాయాన్ని ఎదిరించటంతో ‘జనతా గ్యారేజ్’ లో వాహనాలను మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను కూడా రిపేర్ చేయటం ప్రారంభం అవుతుంది. ఆ క్రమంలో సత్యం తమ్ముణ్ణి, తమ్ముడి భార్యను పోగొట్టుకుంటాడు. తమ్ముడి కొడుకు ఆనంద్ అప్పటికి నెలల పిల్లాడు. ‘జనతా గ్యారేజ్’ వల్ల ఆనంద్ కు జీవితాంతం ఎటువంటి ఇబ్బంది కలగదని మాటిచ్చి తన మేనమామ (సురేష్)కు ఆ బిడ్డను ఇచ్చి పంపించేస్తాడు సత్యం. ఆనంద్ తిరిగి ‘జనతా గ్యారేజ్’కి ఎలా చేరుకున్నాడు ? ‘జనతా గ్యారేజ్’ వారసత్వాన్ని ఎలా కొనసాగించాడు ? ప్రజలకు నష్టం జరిగే ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్యారేజ్ తరపున ఎలా పోరాడి గెలిచాడు అనేదే ఈ కథ.

కథనం విషయానికి వస్తే కొరటాల శివ సినిమాల్లో లాగానే చాలా నెమ్మదిగా సాగింది. ఈ సినిమా నిజానికీ మరింత నెమ్మదించింది ప్రీ టైటిల్ స్టోరీనే దాదాపు ఇరవై నిముషాల పాటు నిదానంగా సాగుతుంది. కథలోకి వెళ్ళటానికే దాదాపు అరగంట దాటేస్తుంది. విరామానికి ముందు ఎన్ఠీఆర్, మోహన్ లాల్ మొదటి సారి కలిసే కన్నివేశం వరకు సినిమా ఎక్కడా ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించదు. అంటే అది సినిమాలో తప్పు కాదు .. మొక్కల్ని పెంచండి, ప్లాస్టిక్ వాడకండి, దీపావళి రోజు టపాసులు కాల్చి పర్యావరణాన్ని పాడు చేయకండి అంటూ హీరో అందరికీ మంచి మాటలు చెబుతూ (మన భాషలో ‘క్లాసులు పీకుతూ’)ఉంటాడు. కేవలం క్లాస్ ప్రేక్షకులకే అది పరిమితం. నిజానికి ఒక మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఎన్ఠీఆర్ ను ఆ పాత్ర చేయటానికి ఒప్పించినందుకు కొరటాల శివ, ఆ పాత్ర చేయటానికి ఒప్పుకున్నందుకు ఎన్ఠీఆర్ అభినందనీయులు. విరామానికి ముందు వచ్చే సన్నివేశంలో మొదలయ్యే అసలు కథ చివరి దాకా కాస్త వేగంగా సాగినా కూడా ఉండాల్సిన వేగంలో మాత్రం లేదు – కానీ ద్వితీయార్ధంలో వచ్చే నాలుగైదు సన్నివేశాల్లోని భావోద్వేగాలు, సంభాషణలు, నటులు ప్రేక్షకులను కాస్త ఆలోచింపజేసేవిగా, కట్టి పడేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫలితం ద్వితీయార్ధం మీదే ఆధారపడుంటుంది అనేది నిస్సందేహం.

ముందుగా చెప్పినట్టు ఇది ‘సర్కార్’ సినిమానే మరో రకంగా తీశారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఇందులో సమస్యగా ఎంచుకున్న అంశాన్ని మరింత బలంగా చూపించాల్సింది. అలాగే ఒక మెకానిక్ షెడ్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు అన్నట్టు చూపించటం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ప్రధమార్ధంలో వచ్చే సన్నివేశాల వరుసలో కూడా దేని తర్వాత ఎందుకు ఏది వస్తోందో ప్రేక్షకులు కాస్త తికమకకు గురయ్యేలా ఉంటుంది. ద్వితీయార్ధంలో సినిమాను గాడిలో పెట్టాడు దర్శకుడు. రాజీవ్ కనకాల ఎపిసోడ్ – తెలుగు సినిమాల్లోని అత్యద్భుతమైన సన్నివేశాల్లో ఒకటి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ సన్నివేశంలో వచ్చే సంభాషణల్లో కొరటాల శివలోని రచయిత విజృంభించాడు. అలాగే మరో నాలుగైదు సన్నివేశాల్లో హత్తుకునేలా ఉంటాయి. సినిమాను రకరకాల మలుపులు తిప్పుతూ తీసుకెళ్ళటానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎక్కడా ఆ ప్రయత్నమే కనిపించదు.

ఒక పారిశ్రామికవేత్త కన్నేసిన పేదల బస్తీలో ప్రజల కోసం పోరాడటానికి సత్యం, ఆ బస్తీ స్థానంలో రాబోయే వాటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం మీద పోరాడే ఆనంద్ – వంటి నేపధ్యాన్ని సత్యం ఆనంద్ కలవటానికి ఎంచుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే ప్రతినాయకుడి పాత్ర – హీరోకు సమానంగా సాగాల్సిన పాత్ర కానీ అది మరీ బలహీనంగా ఉంటుంది. ఎన్ఠీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో తెర మీద కనిపించే నిడివే తక్కువ ఉండటం అనేది ఒకింత నష్టం కలిగించే అంశమే అయినా కొరటాల శివ సాహసాన్ని మెచ్చుకోవాలి. సినిమాను మరింత బాగా ముగించాల్సింది – తన గత చిత్రమైన ‘శ్రీమంతుడు’లో కూడా కొరటాల వ్యక్తి మీద పోరాడతాడు, సమస్య మీద కాదు. ఒక ముగ్గురిని చంపేసి ‘శ్రీమంతుడు’, ఇద్దరినీ చంపేసి ‘జనతా గ్యారేజ్’ సినిమాలను ముగించేశారు. ఇద్దరు కథానాయికలు నామమాత్రం – సమంతా ఎప్పటి లాగే చాలా బాగా చేసింది, నిత్యా మీనన్ మరీ బొద్దుగా ఉంది, కాకపోతే మళ్ళీ కాస్త లావెక్కిన ఎన్ఠీఆర్ పక్కన చక్కగా ఉంది – మహానటి సావిత్రి తో ఈ మధ్య నిత్య ను ఎక్కువగా పోల్చారేమో కాబోలు, నటించటం బాగా తగ్గించింది.

మోహన్ లాల్ –  ‘జనతా గ్యారేజ్’ అనే మెకానిక్ షెడ్ గురించి తాను పడే తాపత్రయం, ఆవేదనను ప్రదర్శించిన తీరు,  ఎన్ఠీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్లలోని సన్నివేశాల్లో, కన్నకొడుకైనా సరే తప్పు చేశాడు కనుక చంపేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చే సన్నివేశంలో మోహన్ లాల్ నటన ప్రశంసనీయం. టైటిల్స్ లో సీనియర్ నటుడైన మోహన్ లాల్ పేరు ముందు రావటం అభినందనీయం. సంగీతం అంతంత మాత్రంగా ఉంది. తిరు ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలైట్.. ‘రాక్ ఆన్ బ్రో’ పాట చిత్రీకరణ ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుంది. సాయి కుమార్, అజయ్, బ్రహ్మాజీ, దేవయాని, ఉన్ని ముకుందన్, సురేష్, సితార, రెహమాన్, బెనర్జీ, సితార తమ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. ఒక చిన్న ఎపిసోడ్ అయినా సినిమా నుంచి బయటకు వచ్చాక గుర్తుండిపోయే ఎపిసోడ్ అది, అందులో రాజీవ్ కనకాల నటన అద్భుతం – తెలుగు సినిమా పరిశ్రమ రాజీవ్ నుంచి రాబట్టుకోవాల్సింది ఎంతో ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఆడవాళ్ళ మీద కుళ్ళు జోకులు, ఆడవాళ్ళ వ్యక్తిత్వాలను చులకన చేస్తూ చౌకబారు సంభాషణలు పలికే  పాత్రలు వ్రాస్తున్న నేటి దర్శకరచయితల తరంలో … భర్తను పోగొట్టుకుని, తన ఐదేళ్ల కొడుకును చూసుకుంటూ ఉండే ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకునే ఒక ఆదర్శ పాత్ర(అజయ్)ను వ్రాసినందుకు కొరటాల శివను ప్రత్యేకంగా మరోసారి అభినందించాలి.

ఎన్ఠీఆర్ – అతను ఒక నటుడు మాత్రమే కాదు, ఒక కళాకారుడు అనటంలో అతిశయోక్తి లేదు. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని పాత్ర, ప్రకృతికి తప్ప దేనికి భయపడని పాత్ర. ఆ పాత్రలో తారక్ ఒదిగిపోయాడు. తన ఇమేజ్ ను పక్కన పెట్టాడు, పేరు కూడా తెలియని పాత్ర దగ్గర చెంపదెబ్బ తిన్నాడు,  మోహన్ లాల్ పాత్రే ఈ సినిమాలో హీరో అనిపిస్తుంది, సినిమా మొత్తం నిడివిలో దాదాపు ఎన్టీఆర్ ఒక గంట సేపు కనిపించడు. కళ్ళతోనే నవరసాల్ని పలికించి … ఈ సినిమాలో తన స్థానంలో ఊహించుకోటానికి కూడా మరో ఏ నటుడు సరిపోడు అనే స్థాయిలో నటించాడు. సినిమా సినిమాకు తన నటన మరింత పరిణితి చెందుతోంది. తనను మర్చిపొమ్మని చెప్పి సమంతాను క్షమాపణ కోరే సన్నివేశంలో ఒకొక్క పాత్రతో ఎన్ఠీఆర్ మాట్లాడేటపుడు పలికించిన హావభావాలు తనకి మాత్రమే సాధ్యం. సాధారణంగా తన సినిమాల్లో లాగా ఎక్కడా అరవటం ఉండదు, ఎంతో గంభీరంగా సాగుతుంది ఈ పాత్ర.

‘నాన్నకు ప్రేమతో’ సినిమా గురించి నేను వ్రాసినప్పుడు ఎన్టీఆర్ నటన గురించి ప్రస్తావిస్తూ – “గత ఇరవై ఏళ్ళలో తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కథానాయకుల్లో అత్యంత ప్రతిభ గల నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పచ్చు” అని వ్రాశాను – ఇప్పుడు మరో సారి ఆ మాట చెప్పటానికి ఏ మాత్రం వెనుకాడను !!

“అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని, కొడుకుల్ని కొట్టేసినా … మీరు మాత్రం ఈ చెట్టు లాగా నిలబడాలి సార్” – ఈ సినిమాలోని ఒక అద్భుత డైలాగ్ …

“అడ్డుపడుతున్న ‘శక్తుల్ని’, అక్కరకు రాని ఇమేజ్ ని కొట్టేసుకుంటూ ఒక కళాకారుడిలా తారక్ ఎదగాలి, నిలబడాలి” – ఇది నా కోరిక

– రావూరి

పీఎస్ : ఈ సినిమా ఫలితాన్ని నేను ప్రస్తావించలేదు, నాకు అది ఎప్పుడూ ప్రామాణికం కాదు !!

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com