కాళి, బాలు – ఒక రావు గోపాల రావు

కాళి, బాలు – ఒక రావు గోపాల రావు yemudiki mogudu 2 desibantu

మనిషి చనిపోయాక స్వర్గం, నరకం అనే లోకాలు నిజంగా ఉన్నాయో లేదో తెలీదు కానీ, తెలుగు సినిమా లోకం మాత్రం నరకలోకం చుట్టూ రా(చే)సుకున్న కథల మీద వచ్చిన సినిమాల పుణ్యమా అని వినోదభరితమైన స్వర్గాన్ని చూశారు – అదే అంశం మీద వచ్చిన మరి కొన్ని సినిమాలను భరించలేక నరకాన్నీ చూశారు. 1960లో వచ్చిన ఎన్ఠీఆర్ ‘దేవాంతకుడు’ నుంచి 2016లో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వరకు ‘చనిపోయిన మనిషి నరకానికి వెళ్లి    యముడి సహాయంతోనో లేక తిరుగుబాటు చేసో తిరిగి భూలోకానికి రావటం’ అనే కథాంశానికి ఎన్ని హంగులు జోడించి ఎంత చక్కగా తీయగలిగారో అంతే విజయాన్ని అందుకున్నారు తెలుగు సినిమా కథకులు, దర్శకులు, నటులు.

రాముడు అమాయకుడు, పిరికివాడు, ఆస్తి పరుడు – ఆ అమాయకత్వాన్ని, భయాన్ని అలుసుగా తీసుకుని రాముడి ఆస్తి కాజేయాలని అక్క భర్త రాజనాల రాముడిని చిత్రహింసలు పెడుతుంటాడు. రాముడిని పోలిన భీముడు ధైర్యవంతుడు, బలవంతుడు – నాటకీయ పరిణామాల మధ్య రాముడి స్థానంలో భీముడు చేరుతాడు – బావకు ఎదురుతిరిగి తగిన బుద్ది చెబుతాడు. ఇది ఆ పాత మధురం ఎన్టీఆర్ నటించిన ‘రాముడు-భీముడు’. తన కూతురిని ప్రేమించాడని సత్యం అనే యువకుడిని చంపిస్తాడు రావు గోపాల రావు – నరకానికి వెళ్ళిన సత్యం భటులను వెట్టి చాకిరీ విషయంలో రెచ్చకొట్టి వారిని చైతన్యవంతుల్ని చేసి, యముడికి తన పోస్టు మీదే అసహ్యం కలిగించేలా మాయ మాటలు చెప్పి నరక లోక ద్వారాలు మూయించి తిరిగి భూలోకానికి వస్తాడు సత్యం. ఇది కూడా ఎన్టీఆర్ నటించిన మరో ఆణిముత్యం ‘యమగోల’ – ఈ రెండు కథలను కలిపి కథానాయకుడికి ఒక కొత్త కోణంలో ద్విపాత్రాభినయాన్ని, తగిన పాళ్ళలో మాస్ ఎలెమెంట్స్ జోడించి ‘సుప్రీం హీరో’ చిరంజీవి కోసం సత్యానంద్ రా(చే)సిన .. కాదు వండిన … కాదు కాదు సృష్టించిన ఒక వండర్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన  “యముడికి మొగుడు”.

ఇక కథలోకి వెళితే … కాళి, బాలు – ఒకరిని పోలిన మరొకరు. కాళి ఒక కిరాయి రౌడీ – రౌడీ ఇజం చేయగా వచ్చిన డబ్బులతో తన బస్తీ వాసులకి ఆర్ధికంగా సాయపడుతుంటాడు. నగరంలో ఒకరంటే ఒకరికి పడని కోటప్ప, కైలాసం అనే ఇద్దరు స్నేహితులు రవాణా వ్యాపారస్తులు. కోటప్ప కొడుకు సుధాకర్, కైలాసం కూతురు రాధను ప్రేమిస్తాడు. యాక్షన్ సినిమా హీరోల్ని ఆరాధించే రాధ ఒకానొక సందర్భంలో కాళి చేసే ఫైట్ చూసి అతనితో ప్రేమలో పడుతుంది. ఈ పెళ్లి ఇష్టం లేని కైలాసం, కాళిని ఎదిరించలేక పెళ్ళికి ఒప్పుకోలేక కోటప్పతో చేతులు కలిపి కాళిని చంపించేస్తాడు. నరకలోకానికి వెళ్ళిన కాళికి విచిత్రగుప్తుడి ద్వారా తన ఆయుష్షు తీరకుండానే తనని చంపేశారని తెలుసుకుంటాడు, తన శరీరానికి దహనసంస్కారం కూడా తీరిపోవటంతో తనలాగే ఉండే బాలులోకి కాళి ఆత్మను పంపించటానికి యముడు కాళిని ఒప్పిస్తాడు. బాలు అమాయకుడు, ఆస్తి పరుడు – తనకు పాతికేళ్ళు వచ్చే వరకు తన ఆస్తి మొత్తాన్ని తన పినతండ్రి పర్యవేక్షణలో ఉంచాల్సిందిగా బాలు తండ్రి విల్లు రాస్తాడు. బాలు ఆస్తి మొత్తం కాజేయటానికి తన పినతండ్రి ‘క్రమశిక్షణ’ పేరుతో బాలుని చిత్రహింసలు పెడుతూ చివరికి చంపేయాలని ప్రయత్నిస్తాడు – సరిగ్గా అదే సమయానికి బాలు శరీరంలోకి కాళి ప్రవేశించి పినతండ్రికి ఎలా బుద్ది చెప్పాడు, అలాగే కాళిగా తన మనుషులను, తమ బస్తీని కొట్టేయాలని చూస్తున్న కోటప్ప, కైలాసంల నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ.

సాధారణంగా ద్విపాత్రాభినయం అనేది ఏ నటుడికైనా రెండు వైపులా పదునున్న కత్తి మీద సాము లాంటిది. రెండు విభిన్నమైన పాత్రలు ఒకే నటుడు ఒకే సినిమాలో చేయాలి – ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్రలో ఒదిగిపోవాలి, ఒక పాత్ర మరో పాత్రలోకి ప్రవేశించినపుడు రెండు పాత్రలు రెండు రకాలుగా అభినయించాలి – ఎక్కడా పాత్రల్లోని లక్షణాలు దెబ్బతినకూడదు, ప్రేక్షకులు కూడా అసలు పాత్రే మరోలా ప్రవర్తిస్తోందా అని తమని తామే మర్చిపోయేలా, కథలో లీనం అయ్యేలా చేయాలి – అప్పటికే ఆరు సినిమాల్లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసినప్పటికీ ఈ సినిమాలోని రెండు పాత్రల తరహాలో ఉండవు – పైగా నరకం, యముడు అనే ప్లాట్ మీద చిరంజీవి చేస్తున్న మొదటి సినిమా. అయినా కూడా చిరంజీవి ఈ పాత్రలకు ప్రాణం పోసి వెండితెర మీద తన నట విశ్వరూపమే చూపించారు.

కిరాయి రౌడీ కాళి పాత్రలో చేసే ఫైట్స్, రాధతో కలిసి వేసే స్టెప్పులు తెలుగు సినిమా దశా దిశను మార్చాయి అని చెప్పచ్చు. రౌడీయిజం చేసి సంపాదించే డబ్బులతో బస్తీలో ఉండే మిత్రుడు హరిప్రసాద్ పరీక్షలకు, ఒక పెద్దాయన తన కూతురిని కాపురానికి పంపటానికి ఆర్ధిక సాయం చేసే సన్నివేశంతో కాళి పాత్ర పరిచయం అవుతుంది. ఎక్కువగా ఫైట్లు, డాన్సులు ఉండే కాళి పాత్ర నిజానికి చిరంజీవికి టైలర్ మేడ్ లాంటిది-కానీ అదే పాత్ర యమలోకానికి వెళ్ళటం అనే ఎలిమెంటుని కూడా చిరంజీవి అలవోకగా పండించారు – యమలోకానికి వెళ్ళగానే “సినిమా హాల్లో కూడా ఎప్పుడూ క్యూలో నిలబడలేదు వెళ్ళవాయ్” అంటూ దూసుకుపోవటం దగ్గర మొదలయ్యే కాళి పాత్రలో చిరంజీవి నటతాండవం – “ఇదిగో ముసలాయన..” అంటూ చిత్రగుప్తుడికి హెచ్చరిక ఇవ్వటం, “మిష్టర్ యమా … నా శరీరం కావాలి, తెచ్చిపెట్టండంతే” అంటూ యముడికి హుకుం జారీ చేయటంలో కానీ,  ” ఏదో అల్లుడిని దువ్వినట్టు దువ్వినంత మాత్రానా … ” అంటూ అల్లు రామలింగయ్యతో అనటంలో చిరంజీవి నటన అమోఘం. కాళిని ఏదో ఒక శరీరంలో ప్రవేశపెడతానని యముడు అన్నప్పుడు చిరంజీవి చెప్పే “భూలోకంలో నా పేస్ కి ఉన్న వేల్యూ ఏవిటో మీకు తెలీదు”, బాలు పాత్రలో ప్రవేశించగానే “నువ్వు చస్తావేమో కానీ నేను చావను బాబాయ్, ఎందుకంటే నేను చిరంజీవిని” అనే డైలాగులు రాసిన మాటల రచయిత చిరంజీవి అభిమానుల్లో అయిపోయే మరో హీరోనే !!

అలాగే బాలు పాత్రకు వచ్చే సరికి బాబాయికి భయపడే అబ్బాయి పాత్ర, కొరడా దెబ్బలు తినాలి, ఇంట్లో ఎవరు ఎన్ని మాటలన్నా పడాలి, ఊర్లో తన వయసు కుర్రాళ్ళు చులకనగా చూసినా భరించాలి – అలాంటి పాత్రను కూడా చిరంజీవి అద్భుతంగా పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆ పాత్రకు తగ్గట్టే ఉండే పంచె కట్టు, పక్కకి దువ్వుకున్న జుట్టులో ఎంతో అమాయకంగా, చాలా అందంగా కనిపిస్తారు. తన ప్రేయసి విజయశాంతిని ఊర్లో ఆకతాయిలు “గౌరమ్మా .. నీ మొగుడెవరమ్మా” అంటూ ఏడిపించినపుడు “పెళ్లికొచ్చి చూసుకోండ్రా..” అంటూ సమాధానం చెప్పటంలో అమాయకత్వం, బాబాయ్ దగ్గర దెబ్బలు తిన్నాక బాల్యం నుంచి తను పడ్డ బాధను చెప్పుకునే  సన్నివేశాల్లో చిరంజీవి నటనకు ఎల్లలు లేవు. ఇక కాళి పాత్ర బాలులోకి ప్రవేశించాక పిన్నికి కోడి పులావ్, చేపల పులుసు, గుత్తి వంకాయ కూర చేయమని పురమాయించటం, ‘క్రమశిక్షణ’ పేరుతో బాబాయ్ మీద తిరుగుబాటు చేయటం – అప్పటి దాకా తనని రకరకాలుగా హింసించిన కుటుంబ సభ్యులందరి దగ్గర ‘ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని’ చేయించటంలో చిరంజీవి నటనను ప్రశంసించటానికి మాటలు చాలవు. ఇటు కాళి ప్రేయసి రాధ, అటు బాలు ప్రేయసి విజయశాంతి మధ్యలో ఇరుక్కోవటంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇక ఇద్దరి మధ్యలో చిక్కుకున్న చిరంజీవి నటన సినిమా విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇన్నీ కలిసి “యముడికి మొగుడు” ఒక సూపర్ డూపర్ హిట్ అయింది.

అలాగే బాబాయ్ రావు గోపాల రావు నటన గురించి కొత్తగా చెప్పేదేముంది – ‘క్రమశిక్షణ’ అనే పదాన్ని ఆయన గంభీర స్వరంతో ఒకో సారి ఒకో లాగా వాడుకుంటూ బాలు పాత్రను శిక్షించే సన్నివేశాల్లో రెచ్చిపోవటం నుంచి… తిరగబడ్డ బాలుకి భయపడుతూ ఒక వైపు “బూజులు దులపటం నాకు కుల వృత్తి కాదు, కాలక్షేపం అంత కన్నా కాదు” అంటూనే  బెంచి ఎక్కి మరీ బూజు దులిపే వరకు హాస్యాన్ని పండించారు. ఇక యముడు ఇలాగే ఉంటాడా అనిపించేలా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య, కొత్తగా సృష్టించిన విచిత్రగుప్తుడి పాత్రలో సుత్తి వేలు, కైలాసం గొల్లపూడి మారుతి రావు, కోటప్ప కోట శ్రీనివాస రావు, చిరంజీవి బామ్మ పాత్రలో సూర్యకాంతం – ఇలా ఎవరికివారే హేమాహేమీలు. చిరంజీవికి రాజ్-కోటి సంగీతం అందించిన తొలి సినిమా ఇదే.  అన్ని పాటలు వేటూరి సుందర రామ్మూర్తి వ్రాశారు. ట్యూన్లు విన్న వేటూరి గారు సినిమా విడుదలకు ముందే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వబోతోంది అని జోస్యం చెప్పారట. ‘అందం హిందోళం’ పాట ఇప్పుడు విన్నా కూడా మనకు తెలియకుండానే మన కాళ్ళు కదులుతాయి, ఈ పాటలో మెట్లు దిగుతూ వచ్చే చిరంజీవి స్టైల్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోరు. అలాగే ఫోక్ తరహా “ఎక్కు బండెక్కు మామ” పాట, “వానజల్లు గిల్లుతుంటే” అనే వాన పాట, “బహుశా నిను బందరులో చూసి ఉంటా” – ఒకో పాట ఒక ట్రెండ్.

చిరంజీవి, సుధాకర్, హరి ప్రసాద్, నారాయణ మద్రాసులో సినిమా ప్రయత్నాల్లో ఉన్న రోజుల నుంచీ మంచి స్నేహితులు – చిరంజీవి సుప్రీం హీరో స్థాయికి ఎదిగారు, మిగిలిన ముగ్గురూ సినిమాల్లో నిలదొక్కుకున్నారు. నారాయణరావు నిర్మాతగా చిరంజీవితో ‘దేవాంతకుడు’ అనే సినిమా నిర్మించారు. చిరంజీవితో మరో సినిమా చేయటానికి నారాయణరావు సిద్దపడ్డప్పుడు సుధాకర్, హరిప్రసాద్ లతో కలిసి నిర్మించవలసిందిగా చిరంజీవి సూచించి ‘డైనమిక్ మూవీ మేకర్స్’ అనే పేరుతో చిరంజీవి చిరకాల స్నేహితులు ఈ సినిమాను నిర్మించారు. (“యముడికి మొగుడు” సినిమా విడుదలయ్యి 2013 ఏప్రిల్ 29కి పాతిక సంవత్సరాలయిన సందర్భంగా టీవీల్లో, పేపర్లలో వచ్చిన కొన్ని ఫీచర్స్ ఆధారంగా ఈ సినిమా నిర్మాణ విషయాలను ప్రస్తావించటం జరిగింది)

సినిమా చివరిలో చిరంజీవి నీకు అంటే నీకు అంటూ రాధ, విజయశాంతి ‘దసరాబుల్లోడు’ సినిమాలోని “నీ వాడే … కాదు నీ వాడే ” అంటూ పాట పాడుతుంటారు – చిరంజీవి యముడిని పిలిచి తనని తీసుకెళ్ళిపొమ్మని చెబుతాడు. అపుడు యముడు చిరంజీవి చెవిలో ఒక ఉపాయం చెబుతాడు, అదే ఉపాయాన్ని చిరంజీవి రాధా, విజయశాంతిలకు కూడా చెవిలో చెబుతాడు. అది ఏమిటో ఎవరికీ తెలియదు – అప్పట్లో నిర్మాతలు ఆ ఉపాయం ఏవిటో ఊహించాల్సిందిగా ప్రేక్షకులకు పోటీ కూడా నిర్వహించారట.

జూనియర్ ఎన్ఠీఆర్ ‘యమదొంగ’  సినిమాలోని ప్రియమణి పాత్ర ‘యముడికి మొగుడు’లోని బాలు పాత్రను పోలి ఉంటుంది – బాలు ఆస్తి కోసం పినతండ్రి రావు గోపాలరావు, కుటుంబం ఉన్నట్టే, ప్రియమణి ఆస్తి కోసం జయప్రకాశ్, కుటుంబం ఉంటుంది. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ ధరమ్ తేజ్ హీరోగా ఇటీవల వచ్చిన ‘సుప్రీం’ చిత్రం  కోసం ‘యముడికి మొగుడు’లోని అందం హిందోళం పాటను రీమిక్స్ చేశారు. “యముడికి మొగుడు” టైటిల్ తోనే అల్లరి నరేష్ హీరోగా ఈ మధ్య సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా 1990లో రజనీకాంత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు.

చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఏడో సినిమా “యముడికి మొగుడు”, నేను చిరంజీవి సినిమాల మీద రాయటం మొదలు పెట్టాక రాస్తున్న ఏడో  సినిమా కూడా ఇదే.  చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు – ఇది కూడా “యముడికి మొగుడు” అంత విజయవంతం కావాలని కోరుకుంటూ …

– రావూరి 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com