మెట్రో-4వ దశకు ఆమోదం!

ఢిల్లీ మెట్రో-4వ దశకు మంత్రిమండలి ఆమోదం.

 

మొత్తం 61.679 కిలోమీటర్ల నిడివిగల మూడు కారిడార్లలో 17 భూగర్భ, 29 ఎత్తయిన స్టేషన్లు; ఎయిరోసిటీ-తుగ్లకాబాద్ మధ్య 15; ఆర్.కె.ఆశ్రమ్-జనక్ పురి వెస్ట్ మధ్య 25 స్టేషన్లు;

మౌజ్ పూర్-ముకుంద్ పూర్ మార్గంలో 6 స్టేషన్లు వంతున ఉంటాయి.

     ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- 3 కారిడార్లతో కూడిన ఢిల్లీ మెట్రో-4వ దశ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ మూడు కారిడార్ల మొత్తం నిడివి 61.679 కిలోమీటర్లు కాగా, ఇందులో 22.359 కిలోమీటర్ల మేర భూగర్భంలో నిర్మాణం చేస్తారు. మరో 39.320 కిలోమీటర్ల మార్గాన్ని భూమికి ఎత్తున నిర్మిస్తారు. ఈ కారిడార్ల పరిధిలోని 46 స్టేషన్లకుగాను 17 భూగర్భంలో, 29 భూమికి ఎత్తున ఏర్పాటవుతాయి. మూడు కారిడార్లలో నిర్మాణ పనుల అంచనా వ్యయం రూ.24,948.65 కోట్లు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వాలకు 50:50 నిష్పత్తిలో వాటాలున్న ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV) ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC) అమలు చేస్తుంది.

అనుసంధానత ప్రత్యేకతలు

1.    ఎయిరో సిటీ –తుగ్లకాబాద్ మార్గంలో 15 స్టేషన్లు: (ఎయిరో సిటీ, మహిపాల్పూర్, వసంత్ కుంజ్ సెక్టార్-డి, మసూద్ పూర్, కిషన్ గఢ్, మహ్రౌలి, లాడో సరాజ్, సాకేత్, సాకేత్ జి-బ్లాక్, అంబేడ్కర్ నగర్, ఖాన్పూర్, టిగ్రి, ఆనందమయీ మార్గ్ జంక్షన్, తుగ్లకాబాద్ రైల్వేకాలనీ, తుగ్లకాబాద్).
2.    ఆర్.కె.ఆశ్రమ్ – జనక్ పురి వెస్ట్ మార్గంలో 25 స్టేషన్లు: (ఆర్.కె.ఆశ్రమ్, మోతియాఖాన్, సదర్ బజార్, పూల్బంగాష్, ఘంటాఘర్/సబ్జీమండీ, రాజ్ పురా, డేరావాల్ నగర్, అశోక్ విహార్, ఆజాద్ పూర్, ముకుంద్ పూర్, భలాస్వా, ముకర్బా చౌక్, బడీమోర్, నార్త్ పీతంపుర, ప్రశాంత్ విహార్, మధుబన్ చౌక్, దీపాలీ చౌక్, పుష్పాంజలి ఎన్ క్లేవ్, వెస్ట్ ఎన్ క్లేవ్, మంగోల్ పురి, పీరాగఢీ చౌక్, పశ్చిమ్ విహార్, మీరాబాగ్, కేశోపూర్, క్రిష్ణ్ పార్క్ ఎక్స్ టెన్షన్, జనక్ పురి వెస్ట్).
3.    మౌజ్ పూర్ – ముకుంద్ పూర్ 6 స్టేషన్లు: (యమునా విహార్, భజర్ పుర, ఖజూరీఖాస్, సూర్ ఘాట్, జగత్ పూర్ విలేజ్, బురారీ).
     ఈ మూడు కారిడార్లలోనూ భూగర్భ (22.359 కిలోమీటర్ల) మార్గం, భూమికి ఎత్తున (39.320కిలోమీటర్ల) మార్గం భాగంగా ఉంటాయి.

ప్రభావం:

     ఈ నాలుగో దశ ప్రాజెక్టువల్ల జాతీయ రాజధానిలోని మరిన్ని ప్రాంతాలను కలుపుతూ మెట్రో నెట్ వర్క్ విస్తరిస్తుంది. ఆ మేరకు మూడు కారిడార్లూ పూర్తయితే మెట్రో ప్రయాణికులకు ప్రస్తుత ఢిల్లీ మెట్రో రైలు లైన్ల మీదుగా మధ్యలో మార్గం మారేందుకు మరిన్ని స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. వివిధ మార్గాలను ప్రయాణికుల గరిష్ఠంగా ఉపయోగించుకునేలా ఈ మెరుగైన అనుసంధానత వీలు కల్పిస్తుంది. మూడు కారిడార్ల పరిధిలో 61.679 కిలోమీటర్ల మార్గం అదనంగా చేరడంవల్ల రహదారులపై రద్దీ తగ్గి, మోటారు వాహనాలవల్ల ఎదురవుతున్న కాలుష్య సమస్యకు పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎయిరోసిటీ-తుగ్లకాబాద్ కారిడార్ వల్ల విమానాశ్రయానికి అనుసంధానం మెరుగుపడుతుంది. మొత్తంమీద మూడు కొత్త కారిడార్లు అందుబాటులోకి వస్తే ఢిల్లీ మెట్రో రైల్ నెట్ వర్క్ పొడవు 400 కిలోమీటర్ల స్థాయిని దాటుతుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com